కాళేశ్వరం కేరాఫ్ టూరిజం..!
- రెండు కోట్లతో పడవను సిద్ధం చేస్తున్న టూరిజం శాఖ
- త్రివేణి సంగమం నుంచి లక్ష్మీ బ్యారేజ్ వరకు షటిల్ సర్వీసులు
Telangana Tourism |
ఇండియాలోని ప్రసిద్ధమైన శివాలయాల్లో కాళేశ్వరం ఒకటి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ లో కాళేశ్వరం గ్రామం ఉంది. ఈ ప్రాంతంలోనే గోదావరి నది ఒడ్డున కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ఉంది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. కాలేశ్వర ముక్తేశ్వరం ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు.. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా వేలకోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే నిర్మించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీర్లు పూర్తి చేయడంతో వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
కాళేశ్వరానికి నిత్యం వచ్చే భక్తులు.. పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కాళేశ్వరంలో బోటు షికారుకు శ్రీకారం చుట్టబోతుంది. సుమారు రెండు కోట్ల వ్యయంతో ఆధునాతనమైన బోటును నిర్మించేలా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్ నుంచి కాళేశ్వరం వరకు 22కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్ నిల్వ ఉంటుంది. దీంతో ఈ ప్రాంతమంతా సముద్రాన్ని తలపిస్తోంది. ఈ ప్రాంతంలో బోటు షికారును ఏర్పాటు చేస్తే కాళేశ్వరానికి వచ్చే భక్తులు.. సందర్శకులు దీనిలో షికారు చేసే అవకాశం ఉంటుందని పర్యాటక శాఖ భావిస్తోంది.
కాళేశ్వరంలో బోటు షికారును ఏర్పాటు చేయడం వల్ల మరింత మంది టూరిస్టులను ఆకర్షించే అవకాశం ఉంటుందని పర్యాటక శాఖ అంచనాలు వేస్తోంది. దీనిలో భాగంగా మరో మూడునెలల్లో కాళేశ్వరంలో బోటును ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 300మంది కూలీలతో గోదావరి తీరం వద్దనే బోటును తయారు చేయించేందుకు సన్నహాలను చేస్తోంది.
కాళేశ్వరంలో ఏర్పాటు చేయబోయే పడవలో ఏసీ.. నాన్ ఏసీ గదులు ఉంటాయని తెలుస్తోంది. 200మంది ప్రయాణం చేసేలా ఈ బోటును డిజైన్ చేయనున్నారు. బోట్ నిర్మాణం పూర్తయ్యాక కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచి లక్ష్మీబ్యారేజ్ వరకు షటిల్ సర్వీసులను నడిపించాలని టూరిజం శాఖ భావిస్తోంది.
కాళేశ్వరానికి వచ్చే భక్తులు.. పర్యాటకులు పండుగ సమయాల్లో ఈ బోటులోనే ప్రయాణికులు వేడుకలు జరుపుకునేలా టూరిజం శాఖ ప్లాన్ చేస్తోంది. మరో మూడునెలలో బోటు నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఆ శాఖ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ బోటు అందుబాటులోకి వస్తే కాళేశ్వరానికి పర్యాటకుల రద్దీ మరింత పెరుగుతుందని టూరిజం శాఖ భావిస్తోంది.
0 Comments