కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. పట్టభద్రులకే పరీక్ష..!
- అనుహ్యంగా దివంగత మాజీ ప్రధాని పీవీ కుమార్తెను బరిలో నిలిపిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తన చాణిక్యాన్ని ప్రదర్శించారు. ఎవరికీ అంతుచిక్కని విధంగా వ్యూహాలు రచిస్తూ ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టే కేసీఆర్ మరోసారి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. రేపటితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్స్ ముగిస్తుండగా నేడు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో రెండు పట్టభ్రదుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 23తో నామినేషన్లకు గడువు ముగియనుంది. ఈక్రమంలోనే అన్ని పార్టీలు ఆయా స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. టీఆర్ఎస్ సైతం వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభ్రదుల ఎమ్మెల్సీ స్థానం కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించింది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభ్రదుల స్థానంలో మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించలేదు. దీనిపై మీడియాలో రకరకాల చర్చలు వచ్చాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో టీఆర్ఎస్ కు బలం లేకపోవడంతో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ తప్పుకుంటుందనే వార్తలు విన్పించాయి.
గతంలో టీఆర్ఎస్ ఈ స్థానం నుంచి ఎన్నడూ గెలిచిన దాఖలు లేకపోవడం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీయడంతో ఈ స్థానంలో పోటీ చేయసేందుకు అభ్యర్థులు వెనుకడుగు వేశారు. సీఎం కేసీఆర్ సైతం దీనిపై కొద్దిరోజులుగా సైలంటయ్యారు. అయితే నామినేషన్ల గడువు ముగిస్తుండటంతో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభధ్రుల అభ్యర్థిపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభ్రదుల స్థానంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవిని బరిలోకి దించారు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న కేసీఆర్ పీవీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆయనను తమవాడిగా ఓన్ చేసుకున్నారు. ఇక తాజాగా ఆయన కుమార్తెను ఎమ్మెల్సీ బరిలో నిలుపడం ద్వారా పట్టభద్రులకే సీఎం కేసీఆర్ పరీక్ష పెట్టినట్లు కన్పిస్తోంది.
తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నర్సింహారావు దేశానికి ప్రధానిగా ఎన్నో సేవలందించారు. పీవీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు ఆయన కూతురికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి సముచిత గౌరవం ఇచ్చినట్లయింది.
టీఆర్ఎస్ సర్కార్ పై ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులు.. ఉద్యోగులు ప్రస్తుత పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కూతురిని ఏమేరకు ఆదరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పీవీ కూతురిని సీఎం కేసీఆర్ అనుహ్యంగా తెరపైకి తీసుకురావడంతో ఇదికాస్తా పట్టభ్రదులకే పరీక్ష మారినట్లు కన్పిస్తోంది.
0 Comments