దేశవ్యాప్తంగా పల్స్ పోలియో.. ఎప్పుడంటే?
- జనవరి 31న పల్స్ పోలియో కార్యక్రమానికి సిద్ధం కావాలని ఆదేశించిన కేంద్ర ఆరోగ్య శాఖ
Pulse Polio Drops |
దేశంలో కరోనా ఎంట్రీతో ఆరోగ్య రంగంలో పనిచేసే వారిపై తీవ్ర ఒత్తిడి పడింది. కొన్నినెలలుగా ప్రభుత్వ ఆస్పత్రులన్నీ కరోనా కేసులకు చికిత్స అందించడమే సరిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకే ప్రాధాన్యత ఇవ్వడంతో వైద్యులు.. పారామెడికల్.. తదితర సిబ్బంది అంతా ఈ పనుల్లోనే బీజీగా మారిపోయారు.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు సంఖ్య తగ్గడం.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మిగతా కార్యక్రమాలపై కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టిసారిస్తోంది. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. తొలుత పల్స్ పోలియో కార్యక్రమాన్ని జనవరి 17న నిర్వహించాలని కేంద్రం భావించింది.
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా కేంద్రం అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహిస్తుండటంతో పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని జనవరి 31న నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది.
దీనిలో భాగంగా జనవరి 30న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జనవరి 31న పల్స్ పోలియో కార్యక్రమాన్నికేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించనుంది.
నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అనే నినాదంతో ప్రతీయేటా ఐదేళ్లలోపు చిన్నారులకు కేంద్రం పల్స్ పోలియో కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది 2021 జనవరి 31న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.
0 Comments