Uber Cup 2022: బ్యాంకాక్ లో జరుగుతున్న ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు సత్తా చాటుతోంది. ఏస్ షట్లర్ పీవీ సింధు నేతృత్వంలోని భారత మహిళల జట్టు మంగళవారం నాడు నాకౌట్ దశకు చేరుకొంది. గ్రూప్-డిలో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు 4-1 తేడాతో అమెరికా మహిళల జట్టునును ఓడించింది.
భారత షట్లర్స్ తొలి మ్యాచ్‌లో కెనడాపై 4-1తో నెగ్గారు. వరుసగా అమెరికాపై గెలువడంతో భారత్ క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకొంది. తొలి సింగిల్స్‌లో పీవీ సింధు 21-10, 21-11తో జెన్నీపై గెలుపొందింది. డబుల్స్‌లో తనీష-ట్రీసా జంట 21-19, 21-10తో ఫ్రాన్సెస్కా-అలిసన్ లీపై గెలుపొందగా ఆకర్షి కశ్యప్ 21-18, 21-11తో ఎస్తర్ షిపై గెలిచి భారత్‌ను 3-0 ఆధిక్యంలో నిలిపారు.
అయితే రెండో డబుల్స్‌లో సిమ్రన్ సింగ్-రితిక ఠాకూర్ 12-21, 21-17, 13-21తో లారెన్-టంగ్ లి చేతిలో ఓడారు. ఇక ఆఖరిమ్యాచ్‌లో అస్మిత 21-18, 21-13తో నాటలీ చైపై నెగ్గింది. ఇక నేడు(బుధవారం) జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కొరియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లోనూ భారత్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
0 Comments