సంక్రాంతి రోజున అల్లుడు అత్తగారింటికి ఎందుకెళ్లాలంటే?
Sankranti Festival |
కొత్త ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతి పండుగ వస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి వెళ్లడాన్ని మకర సక్రమణం అంటారు. దీని అర్థం ధర్మ రూపుడైన సూర్యుడు.. అర్ధ ధన రూపమైన శనీశ్వరుడికి చెందిన మకరరాశిలోకి అడుగుపెట్టడం.
సూర్యుడు సంక్రమణ కాలం నాటికి రైతులకు పంట చేతికొస్తుంది. రైతు చేతికి డబ్బు వచ్చిందంటే అందరి చేతికి డబ్బు వచ్చినట్లే. మనకు వచ్చిన డబ్బును కొంత ధర్మ కార్యాలకు ఉపయోగించమని సంక్రాంతి సందేశం ఇస్తుంది.
సంక్రాంతి.. మూడు రోజుల పండుగ. సంక్రాంతి ముందురోజు భోగి.. ఆ తర్వాత కనుమ పండుగలు వస్తాయి. అందరి ఇళ్ల ముందు ముగ్గులు.. గొబ్బెమ్మలు.. హరిదాసు కీర్తనలు.. పతంగులు.. కోడి పందేలు.. పిండివంటలు మొదలైనవని ప్రత్యేకంగా కనువిందు చేస్తాయి.
- సంక్రాంతి రోజున అత్తగారింట్లో అల్లుళ్ల సందడి..
ఏ పండుగైన సరే ఇంటి అల్లుడిని మర్యాదపూర్వకంగా పిలువడం సంప్రదాయంగా వస్తోంది. అయితే సంక్రాంతికి మాత్రం అల్లుడికి విశిష్ఠ స్థానం ఉందని తెలుస్తోంది. పురాణాల ప్రకారం అల్లుడిని విష్ణు స్వరూపమని అంటారు.
సూర్యుడిని నారాయణ మూర్తి అని సంబోధిస్తుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని అత్తగారింటికి సూర్యుడైన అల్లుడు అడుగుపెట్టాడనే అర్థం దీనిలో దాగి ఉంది.
అందుకే సంక్రాంతి రోజున ఇంటి అల్లుడిని తప్పనిసరిగా పిలవాలనే సంప్రదాయం ఉంది. ఈరోజు అల్లుడి చేత గడ్డ పెరుగును తినిపిస్తారు. ఇలా చేయడం వల్ల అల్లుడి వంశం వృద్ధి చెందుతుంది. అల్లుడు లేనివారు బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తారు.
0 Comments