టెట్ కోసం ఏర్పాట్లు.. మరో పది రోజుల్లో నోటిఫికేషన్..!
- ఆన్ లైన్లో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్న టీఎస్ సర్కార్
TET-2021 |
తెలంగాణలో త్వరలోనే 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా వివరాలను సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో పోలీస్.. ఉపాధ్యాయ పోస్టులు అధికంగా ఉన్నాయి. పోలీస్ ఉద్యోగాల భర్తీని తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ నిర్వహించనుంది. దీనికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం లేకపోవడంతో త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.
ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలంటే మాత్రం టెట్ అర్హత తప్పనిసరి. టెట్ కాలపరిమితి ఏడేళ్లుగా నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో టెట్ ను నాలుగు సార్లు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో రెండు సార్లు టెట్ నిర్వహించారు.
చివరిసారిగా టెట్ పరీక్షను 2014 మార్చిలో నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి టెట్ గడువు ముగియనుంది. త్వరలోనే పెద్దసంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుండటంతో మరోసారి టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
కొత్తగా బీఈడీ.. డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఈసారి టెట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం కన్పిస్తోంది. దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షలు మంది కొత్తగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
టెట్ నోటిఫికేషన్ ను వీలైనంత త్వరగా రిలీజ్ చేసి.. అభ్యర్థుల ప్రిపరేషన్ కోసం ఎనిమిది వారాల సమయం ఇచ్చే అవకాశం ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. టెట్ పరీక్షను ఈసారి ఆన్ లైన్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది.
0 Comments